ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం ఆలయానికి నటి శ్రీలీల వెళ్లారు. తన తల్లితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమె, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీల కోసం ప్రయత్నించారు. వారందరికీ ఆమె ఎంతో ఓపికగా స్పందించి సెల్ఫీలు ఇచ్చారు.
'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, రవితేజతో చేసిన 'ధమాకా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత నటించిన 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్', 'గుంటూరు కారం', 'రాబిన్ హుడ్', 'మాస్ జాతర', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'పరాశక్తి' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే ఆమెకు విజయాన్ని అందించింది.
కెరీర్ పరంగా శ్రీలీల కొన్ని సినిమాల నుంచి తప్పుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఆమె మధ్యలో తప్పుకున్న 'లెనిన్' సినిమా బ్లాక్ బస్టర్ కాగా, అజిత్ సినిమాలో కూడా ఆమె నటించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల ఒక హిందీ చిత్రంతో పాటు, ధనుష్ నటిస్తున్న 'ఓమ్' సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.







