భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు అమెరికా నుంచి జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ ఒప్పందం గురించి భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారం వెల్లడించారు. అయితే, భారత్ ఎన్ని క్షిపణులను కొనుగోలు చేస్తోంది లేదా ఈ ఒప్పందం విలువ ఎంత అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
జావెలిన్ అనేది భుజంపై ఉంచుకుని శత్రువుల ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించే క్షిపణి. ఇందులో 3.7 అడుగుల క్షిపణి, లాంచ్ ట్యూబ్ (క్షిపణిని ప్రయోగించే గొట్టం), కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వీటిని అమెరికాకు చెందిన రక్షణ రంగ సంస్థలు రేథియాన్, లాక్‌హీడ్ మార్టీన్ అభివృద్ధి చేశాయి.
ఈ క్షిపణిలో రెండు దశల్లో పేలుడు పదార్థాలు ఉంటాయి. మొదటి దశలో ట్యాంకుకు ఉన్న రక్షణ కవచాలను ఛేదిస్తుంది, ఆ తర్వాత రెండో దశలో ఉండే వారెహెడ్ (పేలుడు పదార్థం ఉండే భాగం) ట్యాంకును పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఒక్కో క్షిపణి ధర సుమారు 2 లక్షల డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
ఇది 'ఫైర్ అండ్ ఫర్గెట్' (ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని అదే వెతుక్కునే) రకానికి చెందిన మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థ. సాయుధ వాహనాలు, పటిష్టమైన రక్షణ స్థావరాలను ఎదుర్కోవడానికి దీనిని రూపొందించారు. ప్రస్తుతం అమెరికా ఆర్మీ, అమెరికా మెరైన్ కార్ప్స్‌తో పాటు పలు దేశాలు వీటిని వాడుతున్నాయి.
ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత లోతుగా మారుతోందనడానికి నిదర్శనమని అమెరికా పేర్కొంది. అంతేకాదు, రక్షణ పరికరాల తయారీలో ఇరుదేశాల మధ్య సహ ఉత్పత్తి (కో-ప్రొడక్షన్) వంటి మరిన్ని అవకాశాలకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని యూఎస్ తెలిపింది.








