1963లో తైవాన్‌లో జన్మించిన జెన్సెన్‌ హువాంగ్‌, 15 ఏళ్ల వయసులో అమెరికాలో చదువు కోసం హోటల్‌లో పని చేస్తూ కప్పులు కడిగారు. ఆ అనుభవం తనకు పనిపై నిబద్ధతను నేర్పిందని ఆయన పలు వేదికలపై గుర్తుచేసుకుంటారు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన, ఎల్‌ఎస్‌ఐ లాజిక్, ఏఎండీ వంటి సంస్థల్లో పనిచేసి అనుభవం గడించారు.

1993లో కుర్టీస్ ప్రేమ్, క్రిస్ మాలాచౌస్కీలతో కలిసి సిలికాన్ వ్యాలీలోని డెన్నిస్ డైనర్‌లో కాఫీ టేబుల్ టిష్యూపై బ్లూప్రింట్‌తో ఎన్విడియాను ప్రారంభించారు. మొదట్లో గేమింగ్ గ్రాఫిక్స్ కోసం పనిచేసిన ఈ సంస్థ, నేడు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ మరియు అటానమస్ డ్రైవింగ్ రంగాలకు వెన్నెముకగా నిలిచింది. చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ వంటి ప్రముఖ ఏఐ మోడల్స్ అన్నీ ఎన్విడియా చిప్స్ ఆధారంగానే పనిచేస్తున్నాయి.

హువాంగ్‌ దూరదృష్టితో జీపీయూలను కేవలం గేమింగ్‌కే పరిమితం చేయకుండా ఏఐ రంగానికి విస్తరించడం ఆయన కెరీర్‌లో కీలక మలుపు. ప్రస్తుతం ఆయన దృష్టి 'జెనరేటివ్ AI' నుండి 'ఫిజికల్ AI' వైపు మళ్లింది. జపాన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో, వృద్ధాప్య సమస్యలు, కార్మికుల కొరతకు ఏఐ రోబోలే పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మనుషులతో కలిసి పనిచేసే రోబోలు, ఆటోమేషన్ పరిశ్రమలే సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతాయని ఆయన నమ్ముతున్నారు.

తన విజయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ 2023లో తిరిగి డెన్నిస్ డైనర్‌ను సందర్శించిన హువాంగ్‌, పాత రోజుల్లోలాగే అక్కడ సర్వింగ్ చేసి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఇటీవల సోథెబీస్ వేలంలో ఆయన ధరించే బ్లాక్ టామ్ ఫోర్డ్ లెదర్ జాకెట్ 9.6 లక్షల డాలర్లకు అమ్ముడైంది. ఈ మొత్తాన్ని యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక ఆవిష్కర్తల ప్రోత్సాహానికి కేటాయించనున్నారు.