2026 ఆగస్టు నెలలో రెండు కీలక ఖగోళ సంఘటనలు జరగనున్నాయి. ఆగస్టు 12, బుధవారం నాడు సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28, శుక్రవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణాలు 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ జీవితాలపై ప్రభావం చూపుతాయని భావిస్తారు.

సూర్యగ్రహణం ప్రధానంగా ఐరోపా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్ మరియు కొన్ని ఉత్తర ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి సమయంలో రావడంతో, మన దేశంలో కనిపించదు. అలాగే, ఆగస్టు 28న సంభవించే పాక్షిక చంద్రగ్రహణం కూడా భారతదేశంలో పగటి సమయంలో ఉండటంతో ఇక్కడ కనిపించదు.

ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించని కారణంగా, సూతక కాలం వర్తించదని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో దేవాలయాల మూసివేత, ఉపవాసాలు లేదా శుభకార్యాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. గ్రహణాల వల్ల ఎటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు.

అయితే, సంప్రదాయ విశ్వాసాలను అనుసరించేవారు గ్రహణం తర్వాత స్నానం చేయడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం వంటివి చేయవచ్చు. అలాగే దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం లేదా సమీపంలోని ఆలయాన్ని దర్శించడం శుభప్రదమని నమ్ముతారు. గ్రహణ ఫలితాలు వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులపై ఆధారపడి ఉంటాయని, నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిదని సూచించారు.