చౌటుప్పల్, ఆంధ్రప్రభ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో చౌటుప్పల్ పోలీసులు కేసును ఛేదించారు. హత్యకు పాల్పడిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.
చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామ సమీపంలోని శనగలగుట్ట వద్ద వ్యవసాయం చేస్తున్న అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36) ఆదివారం హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు దానయ్య భార్య రాపోలు శారద (34), అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాపోలు శివ అలియాస్ చింటూ (19)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంబంధానికి భర్త దానయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన శారద, శివతో కలిసి అతడిని హత్య చేసేందుకు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 23న మధ్యాహ్నం సమయంలో శనగలగుట్ట వద్ద దానయ్యపై రాళ్లతో దాడి చేసి, అనంతరం కర్రతో తలపై తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు రాపోలు శివ, రాపోలు శారదలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. కేసును వేగంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఎస్‌ఐలు కె. యాదగిరి, పి. రవీందర్, బి. అజయ్ భార్గవ్, కానిస్టేబుళ్లు అశోక్, ఉదయ్, జంగయ్య తదితర సిబ్బందిని డీఎస్పీ మధుసూదన్ రెడ్డి అభినందించారు.







