హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీ లోయలో ఉన్న మలానా గ్రామం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రజాస్వామ్య గ్రామం. ఇక్కడ గ్రామానికి సొంత పార్లమెంట్, ఎగువ-దిగువ సభలు, పోలీసు స్టేషన్ మరియు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. గ్రామ వివాదాలు, పరిపాలన అన్నీ గ్రామ పెద్దల సభలోనే పరిష్కరించబడతాయి.
చరిత్రకారులు చెబుతున్న ప్రకారం, క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ భారత్ పై దండెత్తినప్పుడు గాయపడిన కొంత గ్రీకు సైనికులు మలానాలో స్థిరపడి, తమ వారసత్వాన్ని కొనసాగించారు. ఈ గ్రామస్తులు తమ వంశం గ్రీకు సైనికుల వారసులు అని నమ్ముతారు. గ్రామంలో ప్రత్యేకంగా జమ్లు రిషి దేవతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
మలానాలో బయటి వ్యక్తులు ఏదైనా వస్తువు, ఇల్లు, గోడ కూడా తాకకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, జరిమానా వసూలు చేస్తారు. దుకాణాల్లో డబ్బును నేరుగా చేతికి ఇవ్వకూడదు. బయటి వారితో సంబంధాలు పెట్టుకోకూడదని గ్రామస్తులు నమ్ముతారు, ఎందుకంటే దైవానికి ఆగ్రహం కలుగుతుందని వారు భావిస్తారు.
మలానా గ్రామస్తులు 'కనాషి' అనే భాషను మాట్లాడతారు, ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ భాషను పవిత్రంగా భావిస్తారు. గ్రామస్తులు లేదా ఆలయాల ఫొటో తీయడానికి అనుమతి తప్పనిసరి. సాహస యాత్రికులకు ఈ గ్రామం స్వర్గధామంగా ఉంది. జారీ నుంచి 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తో మలానాకు చేరుకోవచ్చు. మే నుంచి జూలై, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సందర్శనకు అనువైన సమయం.








