ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇథనాల్ కంపెనీల ఏర్పాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతుల జీవితాల్లో అలజడులు రేపుతోంది. పచ్చని పంట పొలాల మధ్యన కాలుష్యాన్ని వెదజల్లే ఈ కంపెనీలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కృష్ణా, తుంగభద్ర నదుల ప్రాంతంలో ఈ కంపెనీలు ఏర్పాటైతే సాగునీరు, తాగునీరు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐజ మండలం పెద్ద దన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుండగా, వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు. ఎన్నికల ముందు ఈ కంపెనీలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే రైతులపై చర్యలు తీసుకోవడం గమనార్హం. గతంలో నారాయణపేట జిల్లా చిత్తనూర్ గ్రామంలోనూ ఇలాంటి కంపెనీ ఏర్పాటు సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులపై లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టింది.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ గ్రామంలో 'జూరాల ఆర్గానిక్' పేరుతో ఇథనాల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి చవక ధరకు 408 ఎకరాలు కొనుగోలు చేసి, 32 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయితీ తీర్మానాలు లేకుండానే అనుమతులు పొందిన ఈ కంపెనీ వ్యర్థాల వల్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చెడువాసన, శరీరంపై దుద్దుర్లు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
తెలంగాణలో 2021 ఇథనాల్ పాలసీ తర్వాత 30 కంపెనీలకు అనుమతి లభించగా, దేశంలోనే అత్యధిక ప్లాంట్లు తెలంగాణలోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో బిపిసిఎల్ (భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ. 1000 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ కోసం 100 ఎకరాలు, రోజుకు 4 వేల కెఎల్ (కిలో లీటర్లు) నీరు అవసరమని అంచనా.
గద్వాల జిల్లా జింకలపల్లి దగ్గర నడుస్తున్న ఇథనాల్ కంపెనీ వల్ల చుట్టుప్రక్కల గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. పచ్చని పొలాలు, గ్రామాల మధ్యన కాకుండా పనికిరాని అసైన్డ్ భూముల్లో ఈ కంపెనీలను ఏర్పాటు చేసుకోవచ్చని రైతులు వాదిస్తున్నారు. అయినప్పటికీ బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల లాభాల కోసమే గ్రామాల మధ్యన ఈ కంపెనీలు ఏర్పాటవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.







