వేములవాడ గ్రామీణ మండలంలోని వెంకటంపల్లి, అచ్చన్నపల్లె గ్రామాల్లో సంప్రదాయ వేషంలో గుర్రంపై తిరుగుతూ తనను ఆధ్యాత్మిక గురువుగా చలామణి చేసుకున్నాడొకడు. తర్వాత చందుర్తి మండలం నర్సింగాపూర్ చేరుకుని సంఘ భవనంలో దిగిన ఈ వ్యక్తి, అనుచరుల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయించి నీళ్లు, కొబ్బరికాయలు సిద్ధం చేయమని కోరాడు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రత్యేక పూజలు చేయాల్సిందేనని నమ్మించి, కొందరి నుంచి నగదు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

గుర్రంపై ఊరేగుతున్న సమయంలో మహిళలపై ఈ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలకు పాల్పడటం గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో అతడి ఉద్దేశాలపై అనుమానం బలపడి, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి అనుచరులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి విచారణ మొదలుపెట్టారు.

ప్రజలు ఆధ్యాత్మిక గురువుల పేరుతో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.