హైదరాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) బాధ్యతలు అప్పగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సిన వీరిని బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వో) గా నియమించడం సమంజసం కాదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పల్స్ పోలియో, వ్యాక్సినేషన్ వంటి అదనపు విధులు నిర్వహిస్తున్న వీరిపై మరో భారం మోపడం సరైనది కాదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జూన్ 25న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఐసీడీఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో, టీచర్లు సెంటర్ల నిర్వహణను పక్కనబెట్టి ఎన్యుమరేషన్ కోసం ఇంటింటికీ వెళ్లాల్సి వస్తోంది. దీంతో సెంటర్లకు వచ్చే చిన్నారులు, పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 వేల కేంద్రాల్లో 15 వేల చోట్ల టీచర్లే నెట్టుకొస్తుండగా, 3,893 అప్‌గ్రేడ్ సెంటర్లలో ఆయాలను నియమించలేదు.

అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండే సెంటర్ సమయాన్ని 10 నుంచి 3 గంటలకు మార్చింది. ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున ఎన్యుమరేషన్ బాధ్యతలు నిర్వహించాలని నిర్దేశించింది. అయితే, పనివేళలు మార్చినా ఫలితం లేదని అంగన్‌వాడీ టీచర్లు పెదవి విరుస్తున్నారు.

దీంతో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. బీఎల్‌వో బాధ్యతల నుంచి తప్పించాలని విన్నవించిన వారు, ప్రభుత్వం పారితోషికం కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.