వరంగల్‌ నగరంలో ఉదయం 8 గంటలు దాటగానే రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. బైక్లు, ఆటోలు, కార్లు, ప్రైవేట్‌ బస్సులు వందల సంఖ్యలో రావడంతో అర కిలోమీటర్‌ ప్రయాణించడానికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. వరంగల్‌ బస్‌స్టేషన్‌ నుంచి హనుమకొండ, కాజీపేట జంక్షన్‌, మడికొండ రోడ్డు, హంటర్‌రోడ్డు-అండర్‌ బ్రిడ్జి, ఖమ్మం రోడ్డు, పోలీసు కమిషనరేట్‌ నుంచి భీమారం, ఫాతిమా జంక్షన్‌ నుంచి కేయూసీ వంద ఫీట్ల రోడ్డు, పెద్దమ్మగడ్డ మార్గాల్లో ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.

నగరం విస్తరించడం, జనాభా పెరగడం, రైల్వే జంక్షన్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకల కారణంగా రోజుకు సగటున 1.5 లక్షల వాహనాలు 35 నుంచి 45 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతున్నాయి. అయితే షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వైన్స్‌, బార్‌ షాప్ల ముందు వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్‌ చేయడం ప్రమాదాలకు కారణమవుతోంది. మామూళ్ల కోసం ట్రాఫిక్‌ పోలీసులు ఇలాంటి పార్కింగ్‌ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నగరంలోని 15 ప్రధాన జంక్షన్లలో మెయింటనెన్స్‌ లేక సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. టెక్నికల్‌ సమస్యలు వచ్చినా వెంటనే సరిచేయకపోవడం, 40కి పైగా ప్రాంతాల్లో సిగ్నల్స్‌ లేకపోవడం వల్ల వాహనదారులు నిబంధనలు పాటించకుండా వెళ్తున్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది డ్యూటీకి ఆలస్యంగా రావడం, సెల్‌ఫోన్లలో మునిగిపోవడం వల్ల వాహనాల క్లియరెన్స్‌ సరిగ్గా జరగడం లేదని విమర్శలు ఉన్నాయి.

సిగ్నల్స్‌ మెయింటనెన్స్‌ బాధ్యత మున్సిపల్‌ కార్పొరేషన్‌దని, తమకు సంబంధం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుపై పోలీసు, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఉన్నతాధికారులు చర్చించినా ఇంతవరకూ కార్యరూపం దాలచలేదు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.