హైదరాబాద్‌లోని ఓ సొసైటీలో నివసించే సావిత్రి ఇటీవల వచ్చిన గాలి వానలకు తమ విల్లా ముందు రెండు చెట్లు పడిపోయాయని, మిగిలిన 25 చెట్లు కూడా ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని సొసైటీని కోరగా, ప్రభుత్వ అనుమతి పొందడానికి చాలా సమయం పడుతుందని వారు చెప్పినట్లు తెలిపారు. దీనిపై హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్‌ చింతల స్పందిస్తూ, అడవిలోనే కాకుండా నగరాల్లో లేదా ఇళ్లలో ఉన్న పెద్ద చెట్లను నరకాలన్నా, కేవలం కొమ్మలు కోయాలన్నా WALTA చట్టం కింద అటవీ శాఖ లేదా నగర పాలక సంస్థ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

అయితే ప్రతి చెట్టుకు అనుమతి అవసరం లేదని, యూకలిప్టస్‌ (జామాయిలు), అశోకచెట్లు మరియు తెలంగాణ ఫారెస్ట్‌ ప్రొడ్యూస్‌ (transi) రూల్స్, 1970లో పేర్కొన్న కొన్ని జాతులు మినహాయింపు పొందాయని వివరించారు. మినహాయింపు ఉన్న చెట్లను నరకాలంటే స్వీయ ధ్రువీకరణ పత్రం జత చేసి ఫార్మ్‌ 13-A ద్వారా అటవీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ టేకు, ఎర్ర చందనం, రోజ్‌వుడ్‌ వంటి చెట్ల విషయంలో మాత్రం దరఖాస్తు చేసి, అధికారులు పర్యవేక్షించి అనుమతి ఇచ్చే వరకు వేచి ఉండాల్సిందే. చెట్లు నరకడానికి కారణాలు మరియు ప్రత్యామ్నాయంగా కొత్త చెట్లు నాటేందుకు రుసుము చెల్లించారా అనే వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.