ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే ఆరోపణల మేరకు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మంగళవారం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మల్టీజోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఇంటిపై దాడులు చేశారు. హైదరాబాద్‌లోని ఛత్రినాకలో ఉన్న ఆయన నివాసంతో పాటు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు బంధువులు, బినామీదారులు మరియు స్నేహితుల ఇళ్లను కూడా అధికారులు తనిఖీ చేశారు.

సోదాల్లో భాగంగా అధికారులు రూ.13.05 కోట్ల విలువ గల ఆస్తులను గుర్తించగా, వాటి మార్కెట్ విలువ రూ.200 కోట్లకు మించి ఉంటుందని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలోని హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలోని హైరైజ్ బిల్డింగ్‌లో 1,860 చదరపు అడుగుల రెండు ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లోని హైరైజ్ బిల్డింగ్‌లో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్ ఆయనకు ఉన్నట్లు తేలింది. అలాగే ఛత్రినాకలో జీ ప్లస్ టూ బిల్డింగ్, గచ్చిబౌలి టీఎన్‌జీఓ కాలనీలో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దాడుల్లో భాగంగా ఇంటి నుంచి రూ.1.54 కోట్ల నగదు, బ్యాంకులో ఉన్న రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్ల విలువ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లు (స్థిర డిపాజిట్లు), 1.3 కిలోల బంగారు ఆభరణాలు మరియు 8 కిలోల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.13,05,67,100గా లెక్కించారు. నరహరిరావు భార్య పేరుపై ఉన్న రెండు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్‌గా నరహరిరావు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనం వంటి అధికారాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా ఆయన భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆయనను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.

నరహరిరావు ఇంటి బెడ్రూంలోని బీరువా పైన ఉన్న కప్‌బోర్డులో రూ.1.54 కోట్ల నగదు, ఒక కిలో బంగారం దొరికినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఏసీబీ దాడుల్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు సంపాదించిన మిగిలిన ఆస్తులపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.