ఫ్రాన్స్ వేదికగా బుధవారం నిర్వహించిన జీ7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. 2025 ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటన తర్వాత ఇరువురు నేతలు నేరుగా కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సమావేశం అనంతరం ట్రంప్ తన 'ట్రూత్ సోషల్ మీడియా' ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఫొటోను 'చీజ్ చెప్పండి' అంటూ పోస్టు చేశారు. ఈ ఫొటోను ముందుగా భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ పోస్టు చేయగా, ట్రంప్ దాన్ని రీషేర్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో ఆ దేశంలోకి భారత పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని గోర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. టెక్నాలజీ, తయారీ, ఔషధ రంగాల్లో భారత కంపెనీలు 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాయని, ఇందులో భాగంగా 12 సంస్థలు 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించాయని వివరించారు.
మీడియాతో మాట్లాడిన ట్రంప్, మోడీని చాలా తెలివైన నాయకుడు, కఠినమైన చర్చాకర్త అని కొనియాడారు. భవిష్యత్తులో తాను భారత్‌ను సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఇటీవల భారత్-అమెరికా సంబంధాల్లో భారత వస్తువులపై సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లు, గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల్లో భారత నావికుల మృతి వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ, హార్ముజ్ జలసంధిలో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అమలులో నావికుల భద్రతకు ప్రాధాన్యం లభిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నావికుల మరణాలపై స్పందించిన ట్రంప్, అది ప్రమాదకరమైన వృత్తి అని, వారంతా గొప్ప వ్యక్తులని పేర్కొన్నారు. భారత్‌పై లేదా మోడీపై ఎవరైనా దాడి చేస్తే సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఈ భేటీ మరుసటి రోజే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సెర్గియా గోర్ కలవడం, ఉగ్రవాదంపై చర్చించడం ఆసక్తి రేపుతోంది.






