గురుగ్రామ్‌కు చెందిన ఐటీ సంస్థలో పనిచేసే రాధా గాయత్రి, ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్ జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేశ్‌కు ప్రయాణించారు. మరుసటి రోజు అర్ధరాత్రి ముస్సోరీ సమీపంలోని టిప్రిధార్‌లో ఉన్న కియానా హోమ్‌స్టేలోని 'బ్లిస్' గదిలో బస చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిద్రపోయిన ఈ దంపతుల్లో భర్త లేచి చూసేసరికి రాధా గాయత్రి నేలపై అపస్మారక స్థితిలో కనిపించారు. ఆమె చుట్టూ రక్తం, మూత్రం ఆనవాళ్లు ఉండగా, ముక్కు నుంచి కూడా రక్తం కారుతున్నట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న ముస్సోరీ పోలీసులు, 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ వైద్యులు ఆమెను పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దుస్తులు లేకుండా నేలపై ఉన్న మృతదేహం పక్కన మంచం, పరుపుపై రక్తపు మరకలు, గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు, కొన్ని ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి. విశాఖపట్నం వాసులైన ఈ జంట వివాహం 2025 నవంబర్ 8న జరిగినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డెహ్రాడూన్‌లోని కొరోనేషన్ ఆస్పత్రికి తరలించగా, ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని పోలీసులు వైద్యులను కోరారు.