తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ, అధికారం చేపట్టే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజాదరణను సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాము బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాధులు, సింగరేణి ప్రాధాన్యం ఉన్న జిల్లాలను కీలకంగా గుర్తించారు.

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే సత్తా కలిగి ఉంది. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లు ఫలితాలను శాసించగలవని భావించిన బీజేపీ నేతలు, ఈ ఓటు బ్యాంక్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోల్ బెల్ట్‌లో పాగా వేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

ఈ దిశగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన విషయాన్ని కార్మికులకు వివరించే ప్రయత్నం జరుగుతోంది. సింగరేణి భరోసా యాత్ర పేరుతో సాగుతున్న పర్యటనల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సంస్థను నాశనం చేశాయని ఆరోపిస్తూ, తామే దానికి అండగా ఉంటామని కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చెబుతున్నారు. నేతలు రోడ్లపై ఆగి స్థానిక స్ట్రీట్ ఫుడ్ తినడం ద్వారా ప్రజలతో కలిసిపోయే భావన కలిగిస్తున్నారు.

కేవలం వచ్చి వెళ్లే కార్యక్రమాలు కాకుండా, పార్టీకి లబ్ది చేకూరేలా ఇతర కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణపై కమలం పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న సంకేతాలను పంపిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, విశ్వాసం నింపేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇంత ముందే రంగంలోకి దిగడం వెనుక పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, ప్రజలను ఆకర్షించడం అనే రెండు లక్ష్యాలను ఏకకాలంగా సాధించాలనే పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.