డాలస్ ఇర్వింగ్ నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వద్ద అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రవాస భారతీయుల పాత్రను ప్రశంసించారు.

మేయర్ జపంటా ఇర్వింగ్ నగర ప్రగతికి ప్రవాస భారతీయులు తోడ్పడుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రతినిధి షాహీన్ టెక్నాలజీ, విద్య, వైద్య రంగాల్లో ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని గుర్తించి, అమెరికా జీడీపీ వృద్ధికి వారి సహకారం ప్రభావవంతమైనదని చెప్పారు.

50 మందికి పైగా చిన్నారులు స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ గా అమెరికా జాతీయగీతం సహా దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ యువత అమెరికా భవిష్యత్తు అని పేర్కొన్నారు. మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర అమెరికా స్వాతంత్య్రంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజల భాషలు, సంస్కృతులు, ప్రతిభలు దేశాన్ని సుసంపన్నం చేశాయని చెప్పారు.

భారతీయ మూలాలున్న అమెరికన్లకు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్రం, వైద్యం, ప్రజాసేవ రంగాల్లో అవకాశాలు కల్పించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం, ఐక్యత, సేవాభావం, నిజాయితీని పెంపొందించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘాల ప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.