చెపాక్ మైదానంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ నష్టపోయి, 28.4 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో పూర్తి చేసింది.
ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 110 పరుగుల అజేయ శతకంతో మ్యాచ్‌ను ముగించగా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. లక్ష్య ఛేదనలో హిట్‌మ్యాన్ 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ అర్ధ శతకం ద్వారా రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించాడు. ద్రవిడ్ 94 సార్లు ఈ ఘనత సాధించగా, రోహిత్ ఇప్పుడు 95 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (145) మొదటి స్థానంలో, విరాట్ కోహ్లి (131) రెండో స్థానంలో ఉన్నారు.
అదేవిధంగా, వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వయస్సులో అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా రోహిత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల 51 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించిన ఆయన, గతంలో మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 1989లో పాకిస్తాన్‌పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో అమర్‌నాథ్ సాధించిన రికార్డును రోహిత్ అధిగమించాడు.







