శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చలమయ్య పేట నివాసి గేదెల పూజిత తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాలపై మృతి చెందారు. పలాస, తాళభద్ర స్టేషన్ల మధ్య ఈ మూడు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబంలో జరిగిన కలహాల కారణంగా గురువారం భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన కుమారుడు కుశాంత్ (5), కుమార్తె దీక్షిత్ (3)లతో కలిసి ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను గేదెల పూజిత, ఆమె పిల్లలు కుశాంత్, దీక్షిత్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆత్మహత్యా లేదా హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవాళ ఉదయం వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్న అధికారులు, పూర్తి వివరాలు తెలియజేస్తూ మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు.







