వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రాష్ట్ర రైతులు పంట సాగుకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జరిగిన సమావేశంలో జూన్ 30న తొలి విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. మధిరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది.

నిధుల పంపిణీలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అధికారులు కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. మొత్తం పెట్టుబడి సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు దశలుగా విభజించి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విధానం ప్రభుత్వంపై ఉండే ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రక్రియలో తొలి దశలో ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వారి ఖాతాల్లోనే ముందుగా నిధులు జమ అవుతాయి. తర్వాతి దశలో రెండు ఎకరాల సాగు భూమి కలిగిన రైతులకు, చివరి దశలో రెండు నుంచి ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు నిధులు అందజేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.