తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 32 ఏళ్ల గు అనే వ్యక్తి కేవలం ఐదు నిమిషాల వీడియో కాల్ ఆధారంగా వివాహం చేసుకుని, తొమ్మిది రోజులకే పశ్చాత్తాపం చెంది విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఈ వివాహానికి తన కుటుంబం దాదాపు రూ.36.95 లక్షలు (2.65 లక్షల చైనీస్ యువాన్లు) ఖర్చు చేసిందని, ఆ మొత్తాన్ని వధువు నుంచి తిరిగి ఇప్పించాలని గు కోరారు. త్వరగా పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చడంతో స్థానిక మ్యారేజ్ బ్యూరోను (వివాహ కార్యాలయం) సంప్రదించిన గు, 200 చైనీస్ యువాన్లు చెల్లించి నమోదు చేసుకున్నారు.

స్థానికంగా ఉన్న ముగ్గురు యువతులు నచ్చకపోవడంతో, మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు వాయవ్య చైనాలోని షాన్‌సీ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల యువతిని పరిచయం చేశారు. ఆమెకు అప్పులు లేవని, నేర చరిత్ర లేదని, అనారోగ్య లేదా జన్యుపరమైన సమస్యలు లేవని ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సాగింది, ఈ సమయంలో యువతి తాను సేల్స్ పర్సన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపింది, అయితే ఎక్కువ ప్రశ్నలకు మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులే సమాధానం ఇచ్చారు. పెళ్లి అర్జెంట్ కావడంతో గు కుటుంబం వధువును ప్రత్యక్షంగా చూడకుండానే వివాహానికి అంగీకరించింది.

వివాహానికి గు కుటుంబం మొత్తం 2.65 లక్షల చైనీస్ యువాన్లు ఖర్చు పెట్టింది, ఇందులో వధువుకు కానుకల రూపంలో లక్ష యువాన్లు ఇవ్వగా, మ్యారేజ్ బ్యూరోకు 1.6 లక్షల యువాన్లు చెల్లించారు. మూడు రోజుల్లోనే వివాహం జరిగినప్పటికీ, మరుసటి రోజు నుంచే వధువు విషయంలో నిజాలు బయటపడ్డాయి. బ్యాంక్‌లో ఆమె క్రెడిట్ రిపోర్టు చూస్తే దాదాపు లక్ష యువాన్ల అప్పు ఉన్నట్లు తెలిసింది, దీనిని ఆమె తన మాజీ ప్రియుడిది అని చెప్పింది. అంతేకాదు, ఆమె మొబైల్ పేమెంట్ యాప్‌లో ఉన్న పేరు మ్యారేజ్ బ్యూరో చెప్పిన పేరుతో సరిపోలకపోవడంతో గుకి అనుమానం పెరిగింది.

పెళ్లి తర్వాత రోజు వధువు తనకు కాలేయ సంబంధిత సమస్య ఉందని, ఎంజైమ్‌ల స్థాయి ఎక్కువగా ఉందని, బరువు తగ్గాల్సి ఉందని తెలిపింది, అయితే సంతానోత్పత్తికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో వివాహం జరిగిన తొమ్మిది రోజులకే గు విడాకులు కోరాడు. మొదట అంగీకరించిన వధువు తర్వాత మనసు మార్చుకుని, గు తనను డిప్రెషన్‌కు గురి చేశాడంటూ రివర్స్ కేసు పెట్టింది. 50 వేల యువాన్లు (సుమారు రూ.7 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని, తనను మేకప్ వేసుకోవాలని, ఇంటి పనులు చేయాలని, ఉద్యోగం వెతుక్కోవాలని గు ఒత్తిడి చేశాడని ఆరోపిస్తూ మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టులో సమర్పించింది.

మరోవైపు గు తమను మ్యారేజ్ బ్యూరో మోసం చేసిందని, తాను చెల్లించిన 1.6 లక్షల యువాన్లు తిరిగి ఇవ్వాలని కోర్టును కోరాడు. అయితే మ్యారేజ్ బ్యూరో మాత్రం తాము పరిచయం చేసిన అమ్మాయినే అతను పెళ్లి చేసుకున్నాడని, డబ్బులు తిరిగి ఇవ్వబోమని స్పష్టం చేసింది. రీఫండ్ కోసమే ఈ జంట విడాకుల పేరుతో నాటకీయత సృష్టిస్తున్నదని మ్యారేజ్ బ్యూరో వాదించింది. ప్రస్తుతం ఈ ఘటన చైనాలో చర్చనీయాంశంగా మారింది.