తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో వానాకాలం సాగుకు అవసరమైన రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిధుల పంపిణీని ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేయనున్న భారీ రైతుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టనున్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలు సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

రైతులు పండించే సన్నధాన్యాల కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, మార్కెట్ డిమాండ్ మరియు ప్రజల అవసరాల దృష్ట్యా కేవలం ఏడు రకాల వరికి మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. బిపిటి 5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటి సోనా, జై శ్రీరామ్, కెఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కెఎన్‌ఎం-7715 అనే ఈ వంగడాలకే ఈ సౌకర్యం వర్తిస్తుందని మంత్రులు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా, కేంద్రం తక్కువ సేకరణ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రివర్గం, మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేయాలని ఢిల్లీని కోరాలని నిర్ణయించింది. అలాగే వానాకాలానికి అవసరమైన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్‌లో తయారయ్యే యూరియాను పొరుగు రాష్ట్రాలకు పంపకుండా స్థానిక రైతులకే కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి కేంద్రం తెచ్చిన విబిజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రం వ్యతిరేకిస్తోంది. ఈ కొత్త చట్టం ప్రభావాన్ని పరిశీలించడానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి సభ్యులుగా కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ (ఫేజ్ 2) కోసం అవసరమైన అనుమతులు మరియు ఐఆర్‌ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) రుణాన్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. ఇకపై కేబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనుండగా, మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. ఈ నెల 21న జరిగే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు హాజరయ్యే 2 లక్షల 95 వేల మంది విద్యార్థులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.