తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ (స్వీకరణ) సభ్యులను నియమించాల్సి ఉంది. అయితే ఈ విధానాన్ని అమలు చేయడానికి కావలసిన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 1,671 గ్రామపంచాయతీలకు మొత్తం 5,013 మంది సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
గ్రామపాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు మరియు ప్రవాస భారతీయులను భాగస్వామ్యం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు మరియు వ్యవసాయ నిపుణుల అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. చెరువుల పునరుద్ధరణ, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో వారి సూచనలు ఉపయోగపడే అవకాశం ఉంది.
చట్టప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోగా ఈ నియామకాలు పూర్తికావాల్సి ఉండగా, ప్రస్తుతం గడువు దాటి నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సీనియర్ సిటిజనన్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, ఎన్‌ఆర్‌ఐలు లేదా భూమి దానం చేసిన వ్యక్తులను ఈ పదవులకు పరిగణిస్తారు. వీరికి వార్డు సభ్యులతో సమాన ప్రొటోకాల్ మరియు సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది కానీ, తీర్మానాలపై ఓటు హక్కు మాత్రం ఉండదు.
ఈ ఆలస్యం కేవలం పదవుల భర్తీకి సంబంధించినది కాకుండా, గ్రామ అభివృద్ధి ప్రణాళికల నాణ్యతను పెంచే అవకాశాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల తర్వాత ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు గ్రామ పెద్దలు మరియు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికార మరియు ప్రతిపక్ష వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారే ఈ ఎంపికల్లో సామాజిక సమతుల్యత మరియు రాజకీయ సమీకరణాలు కీలకం కావడంతోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంలో జాప్యం చేస్తోందనే చర్చ స్థానికంగా సాగుతోంది.
ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపడతామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు. గ్రామాభివృద్ధికి సలహాదారులుగా ఉండాల్సిన ఈ వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








