బకింహామ్ ప్యాలెస్ మరమ్మతులకు రూ.4,600 కోట్లు (£369 మిలియన్లు) ఖర్చు చేసినా, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా ఇక్కడ నివాసం కాదని రాయల్ అకౌంట్స్ నివేదికలో వెల్లటించారు.
1837 నుంచి బ్రిటన్ పాలకుల అధికారిక నివాసంగా ఉన్న ఈ భవనాన్ని రాజు ఇకపై ఉపయోగించకూడదని నిర్ణయించారు. రాజు బకింహామ్ ప్యాలెస్‌లో ఉండకపోవడానికి కారణం సాధారణ ప్రజలు, పర్యాటకులు ఈ చారిత్రాత్మక కట్టడాన్ని సులభంగా సందర్శించేలా చేయడం. రాజు అక్కడ ఉంటే భద్రతా ఆంక్షలు పెరుగుతాయని, మరమ్మతులు పూర్తి కావడానికి వచ్చే ఏడాది వరకు సిబ్బంది మరియు పర్యాటకుల కోసం ప్యాలెస్‌ను పూర్తిగా తెరవాలని రాజభవన వర్గాలు తెలిపారు.
రాజు ప్రస్తుతం క్లారెన్స్ హౌస్‌లో నివసిస్తున్నారు. ఇది ఒకప్పుడు క్వీన్ మదర్ నివాసంగా ఉండేది. 2005లో వివాహం తర్వాత క్వీన్ కెమిల్లాతో కలిసి ఇక్కడే నివాసం మొదలుపెట్టారు. వారి వయసు 70 దాటడంతో, పెద్ద ప్యాలెస్‌లో నివాసం మార్చే హడావుడి వారికి ఇష్టం లేదని తెలుస్తోంది.
లిబరల్ డెమోక్రాట్ పార్టీ మాజీ మంత్రి నార్మన్ బేకర్ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, ప్యాలెస్‌ను పర్యాటకులకు పూర్తిగా తెరిచి, టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో మరమ్మతుల ఖర్చును తీర్చాలని సూచించారు. అయితే, రాజు బకింహామ్ ప్యాలెస్‌లో లేకపోయినా, అధికారిక సమావేశాలు అక్కడే జరుగుతాయని రాజభవన అధికారులు హామీ ఇచ్చారు.








