2026 ఎన్నికల సిద్ధత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక తీవ్ర సవరణ (SIR) ప్రక్రియను చేపట్టుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఖమ్మం మయూరిసెంటర్‌లో గురువారం నుంచి బూట్ లెవల్ అధికారులు ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారాలు పంచడం ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కు కల్పించడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం.

ఓటర్లు ఇప్పుడు ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేయొచ్చు. ఈ సదుపాయం ద్వారా బూట్ లెవల్ అధికారులకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఫారం పూర్తి చేసిన తర్వాత ఈ-సైన్ పేజీకి రీడైరెక్ట్ అయ్యి, ఆధార్ నంబర్ ఆధారంగా ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయాలి. విజయవంతంగా అప్‌లోడ్ అయిన తర్వాత మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.

ఓటర్ల జాబితా, ఆధార్ కార్డులో పేర్లు సరిపోలిన వారందరూ ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓటర్ ఐడీతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. లింక్ కాకపోతే మొదట 'ఫారం-8' పూరించి మొబైల్ నంబర్‌ను జోడించాలి. ఆన్‌లైన్ సాధ్యం కాకపోతే బూట్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఫారాలు అందిస్తారు. అయితే గోప్యత, సౌలభ్యం కారణంగా ఆన్‌లైన్ విధానాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.