అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు కాంగోతో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 90 నిమిషాల పాటు మైదానంలో ఉన్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. అంతేకాకుండా ఇతర ఆటగాళ్లకు కనీసం పాస్ అందించడంలోనూ విఫలమయ్యాడు. మెస్సీ, ఎంబాపె, ఎర్లింగ్ హాలండ్, లామినే యమాలా, హ్యారీ కేన్ వంటి సమకాలీన ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లోనే గోల్స్ చేసి జట్లకు విజయం అందించడంతో, రొనాల్డో ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తాయి.
రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో ఈ మ్యాచ్‌లో కేవలం 25 సార్లు మాత్రమే బంతిని తాకారు. ఇది గతంలో ఆయన ఆడిన ప్రతి ఫిఫా టోర్నమెంట్‌తో పోలిస్తే అత్యల్పం. కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే షాట్ ఆడే ప్రయత్నం చేశారు. మొత్తంగా రెండు ప్రోగ్రెసివ్ క్యారీలు, రెండు ప్రోగ్రెసివ్ పాస్‌లు మరియు రెండు ఏరియల్ డ్యూయల్స్ మాత్రమే నమోదయ్యాయి. వయసు రొనాల్డోకు అడ్డంకిగా మారిందని, పాదరసంలా కదులుతున్న మెస్సీతో పోలిస్తే రొనాల్డో పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడినట్లు ఈ మ్యాచ్‌లో కనిపించింది.
2006లో తొలి ఫిఫా ప్రపంచకప్ ఆడినప్పుడు రొనాల్డో వయసు 21 ఏళ్లు కాగా, 2026 నాటికి ఆయన వయసు 41 ఏళ్లు. గత 20 ఏళ్లలో ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో మొత్తం 8 గోల్స్ మాత్రమే చేశారు. రష్యా వేదికగా 2018లో జరిగిన టోర్నమెంట్‌లో ఆయన అత్యధికంగా నాలుగు గోల్స్ చేశారు. పోర్చుగల్ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో రొనాల్డో 396 నిమిషాలు మైదానంలో గడిపినా, ఆ జట్టు కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది.
రెండు దశాబ్దాలకు పైగా ఫుట్‌బాల్‌ను ఏలుతున్న రొనాల్డో, తనపై వచ్చే విమర్శలకు ఎప్పుడూ గోల్స్‌తో సమాధానం ఇస్తూ వచ్చారు. మాంచెస్టర్ నుంచి మాడ్రిడ్, టురిన్ నుంచి రియాద్ వరకు, పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అసాధారణ కెరీర్‌తో అంచనాలను తిరగరాశారు. ఒక్క ఫిఫా ప్రపంచకప్ మాత్రమే సాధించలేదు. ఈసారి కూడా ఆయన తన ఆటతోనే ప్రపంచం మొత్తం తనను ప్రశంసించేలా చేసుకోవాల్సిన సమయం వచ్చింది.








