సర్ పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బిజెపి వ్యూహాలను తిప్పికొట్టే దిశగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 21 నుంచి నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మక్తల్ నియోజకవర్గం వేదిక కాగా, తర్వాత 23న ఆందోలులో పర్యటించి, ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నారు.

పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం. గత నెలలో గాంధీ భవన్‌లో మండల, గ్రామ స్థాయి నేతలకు ఏఐసిసి (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ట్రైనర్లు జనగణన, ఓట్ల సవరణ ప్రక్రియల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ శిక్షణ పొందిన నేతలు ఇప్పుడు తమ ప్రాంతాల్లో ఏజెంట్లకు బోధిస్తుండగా, ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వం ఈ తరగతులకు హాజరై అదనపు సూచనలు చేయనుంది.

నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా ముఖ్య నేతలతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ సమావేశం నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించిన సందర్భాల్లో, జనాభా లెక్కల అధికారులకు ఫిర్యాదు చేసే విధానం, అందుకు అవసరమైన ఫారమ్‌ల వినియోగంపై కూడా నేతలు వివరణ ఇవ్వనున్నారు. బిజెపి ఎత్తుగడలను గమనిస్తూనే, అవి అమలు కాకుండా అడ్డుకునే వ్యూహాలపై కూడా ఈ సమావేశాల్లో దృష్టి సారించనున్నారు.